విశ్వాసం దెబ్బతిన్నది.. చైనా దౌత్యవేత్త భేటీలో అజిత్ దోవల్

మూడేళ్ల క్రితం భారత్-చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో రెండు దేశాల మధ్య విశ్వాసం దెబ్బతిన్నదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు.

Update: 2023-07-25 15:05 GMT

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం భారత్-చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో రెండు దేశాల మధ్య విశ్వాసం దెబ్బతిన్నదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. వ్యూహాత్మక, ప్రజా, రాజకీయ సంబంధాలు సైతం దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో ఆయన చైనా దౌత్యవేత్త వాంగ్ యీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. చైనా ఎన్నడూ ఆధిపత్యం కోసం ప్రయత్నించబోదని, భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తుందని వాంగ్ యీ చెప్పారు. భారత్, చైనా వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంచుకొని, సహకారంపై దృష్టి పెడుతూ, సంబంధాలను పూర్వ స్థితికి తీసుకురావాలని ఆకాంక్షించారు.

బహుళ ధ్రువ ప్రపంచానికి, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్య ధోరణికి చైనా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. బ్రిక్స్ సమావేశానికి హాజరు కావాల్సిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ డుమ్మా కొట్టడంతో చైనా పొలిటికల్ బ్యూరో సభ్యుడైన వాంగ్ యీ వచ్చారు. సరిహద్దు సమస్యలపై దోవల్, వాంగ్ యీ రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధులుగా చర్చలు జరుపుతున్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాంగ్ యీ ఇటీవల సరిహద్దు సమస్యపై చర్చించారు. సైబర్ సెక్యూరిటీపై సమిష్టిగా పని చేయాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్న బ్రిక్స్ సమావేశంలో దోవల్ పిలుపునిచ్చారు.


Similar News