త్రిపురలో సీపీఎం నేత హత్య.. బంద్ కు పిలుపు

సౌత్ త్రిపురలోని రాజ్‌నగర్‌లో సీపీఎం నేత బాదల్ షీల్‌ దారుణ హత్య జరిగింది. బాదర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2024-07-14 03:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సౌత్ త్రిపురలోని రాజ్‌నగర్‌లో సీపీఎం నేత బాదల్ షీల్‌ దారుణ హత్య జరిగింది. బాదర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. త్రిపురలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో హత్య జరగడంతో రాజకీయంగా దుమారం రేగింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బాదల్ ను బీజేపీ మద్దతు ఉన్న గూండాలే హత్య చేశారని సీపీఎం ఆరోపించింది. ఆదివారం 12 గంటల రాష్ట్రవ్యాప్త బంద్ కు సీపీఎం పిలుపునిచ్చింది.

బంద్ కు పిలుపునిచ్చిన సీపీఎం

రాజ్‌నగర్ మార్కెట్‌లో బాదల్ పై కత్తులు, కర్రలు, ఇతర ఆయుధాలతో దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అగర్తలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ హత్యపై సీపీఎం త్రిపుర కార్యదర్శి జితేంద్ర చౌదరి నిప్పులు చెరిగారు. ఇది బాదర్ షిల్ హత్య కాదని.. ప్రజాస్వామ్య ఖూనీ అని మండిపడ్డారు. హత్యకు నిరసనగా ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్ర 6 గంటల వరకు బంద్ కొనసాగుతుందన్నారు. మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని బీజేపీ తెలిపింది. నిందితులను ఇంకా గుర్తించలేదని సౌత్ త్రిపుర ఎస్పీ అశోక్ కుమార్ సిన్హా అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.


Similar News