నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన కూలీలు

నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా వారిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు

Update: 2024-06-07 04:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా వారిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటన జూన్ 4 న జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు పార్లమెంట్ హౌస్ గేట్ నెంబర్ 3 వద్ద ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులను భద్రతా సిబ్బందికి చూపించి భవనం లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కార్డులను చూడగానే అనుమానం వచ్చిన సిబ్బంది, ఆధార్‌లను చెక్ చేయగా అవి ఫేక్ అని తేలింది. దీంతో వెంటనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

వారిని కాసిం, మోనిస్, షోయబ్‌‌గా గుర్తించారు. ఈ ముగ్గురు కూడా ఒక కాంట్రాక్టర్ క్రింద పని చేస్తున్నట్లు తెలిసింది. భవనంలోని ఎంపీ లాంజ్‌లో నిర్మాణా పనుల కోసం వీరిని నియమించుకున్నారు. ఫోర్జరీ, మోసానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 419/465/468/471/120B కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌లో కూడా కొంతమంది పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించి లోక్‌సభలో పొగ డబ్బాలు విసరగా, ఎంపీలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన మనోరంజన్ డి, సాగర్ శర్మ, అమోల్ ధనరాజ్ షిండే, నీలం రనోలియా, లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లను అరెస్ట్ చేశారు.


Similar News