Odisha train accident: ఆ ముగ్గురి వల్లే ఒడిశా రైలు విషాదం..

నెల క్రితం (జూన్‌ 2న) జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2023-07-07 16:32 GMT

భువనేశ్వర్‌: నెల క్రితం (జూన్‌ 2న) జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. రైల్వేశాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌) అరుణ్‌ కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ ఖాన్‌, టెక్నీషియన్‌ పప్పు కుమార్‌ ఉన్నారు. రైలు ప్రమాదాలకు కారకులు అవ్వడంతో పాటు హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య, సాక్ష్యాలను ధ్వంసం చేశారనే అభియోగాలను వారిపై సీబీఐ నమోదు చేసినట్లు సమాచారం.

ఈ ముగ్గురి చర్యలే ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెను ప్రమాదానికి దారి తీస్తుందనే అవగాహన ఆ ముగ్గురికి ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగే కారణమని ఇటీవల రైల్వే భద్రతా కమిషనర్‌ (సీఆర్ఎస్) కూడా దర్యాప్తు నివేదిక ఇచ్చింది. జూన్‌ 2న రాత్రి 7 గంటలకు ఒడిశా బాలాసోర్ జిల్లా బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కేవలం 15 నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 293 మంది మృతి చెందగా.. 1000మందికిపైగా గాయపడ్డారు.


Similar News