Salman Khan : ‘‘సల్మాన్.. బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వు’’.. మరో బెదిరింపు మెసేజ్ కలకలం
దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరో బెదిరింపు మెసేజ్ వచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరో బెదిరింపు మెసేజ్ వచ్చింది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబరుకు అక్టోబరు 17న ఈ వార్నింగ్ మెసేజ్‌ను పంపినట్లు గుర్తించారు. ‘‘జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయితో వివాదాన్ని సర్దుబాటు చేసుకునేందుకు సల్మాన్ ఖాన్ రూ.5 కోట్లు చెల్లించాలి. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్‌తో అతడి శత్రుత్వం ముగియాలన్నా రూ.5 కోట్లు కట్టాల్సిందే. లేదంటే ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ కంటే దారుణమైన పరిస్థితిని సల్మాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఆ మెసేజ్‌లో దుండగుడు హెచ్చరించాడు.
ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబరుకు ఈ మెసేజ్‌ను పంపిన కాసేపటికి.. అదే నంబరు నుంచి మరో మెసేజ్‌ను కూడా పంపాడు. ‘‘మేం ఇంతకుముందు పొరపాటున ఈ నంబరుకు మెసేజ్‌ను పంపాం’’ అని అందులో దుండగుడు ప్రస్తావించాడు. ఈ మెసేజ్‌ను పంపిన వ్యక్తిని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో అరెస్టు చేశామని ముంబైలోని వర్లీ ఏరియా పోలీసులు వెల్లడించారు. అతడిని విచారణ నిమిత్తం ముంబైకి తీసుకొస్తామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.