నాలుగేళ్లుగా కూతురిపై లైంగికదాడి.. తండ్రికి ఏకంగా 72 ఏళ్ల జైలు శిక్ష!

మైనర్ అని చూడకుండా కన్నకూతురిపై గత నాలుగేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఓ కీచక తండ్రికి కేరళలోని ఇడుక్కి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏకంగా 72 ఏళ్ల పాటు వివిధ రకాల జైలు శిక్షలు విధించింది.

Update: 2024-10-23 19:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మైనర్ అని చూడకుండా కన్నకూతురిపై గత నాలుగేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఓ కీచక తండ్రికి కేరళలోని ఇడుక్కి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏకంగా 72 ఏళ్ల పాటు వివిధ రకాల జైలు శిక్షలు విధించింది. రూ.1.8 లక్షల జరిమానాను సైతం బాధితురాలికి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. కూతురిపై లైంగికదాడి కేసులో నిందితుడికి పోక్సో చట్టం, ఐపీసీ కింద ఇడుక్కి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి లైజుమోల్ షెరీఫ్ ఈ సంచలన తీర్పు చెప్పినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షిజోమన్ జోసెఫ్ బుధవారం మీడియాకు వివరించారు.

కోర్టు విధించిన మొత్తం 72 ఏళ్ల శిక్షలో నిందితుడు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉండగా, ఏకకాలంలో వివిధ రకాల శిక్షలు సైతం అమలు చేయబడతాయన్నారు. నిందితుడు సెలవుల్లో హాస్టల్ నుంచి వాగమోన్ గ్రామంలోని తన ఇంటికి వచ్చిన 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ నేరం వరుసగా 2012 నుంచి 2016 మధ్య నాలుగేళ్ల పాటు జరగగా.. బాధితురాలు 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబితే తండ్రి చంపేస్తాడనే భయంతో బాలిక నేరం గురించి ఎవరికీ చెప్పలేదని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.

కాగా, బాధితురాలి తండ్రి ఇప్పటికే ఒక హత్య కేసులో జైలులో ఉన్నారని సమాచారం. తన చదువుకు సహకరించే తన తండ్రి ఫ్రెండ్ ముందుగా ఈ అఘాయిత్యం గురించి తెలుసుకుని, తనను ప్రోత్సహించడంతో ఈ నేరాన్ని పోలీసులకు వివరించినట్లు బాధితురాలు అంగీకరించింది. తన తండ్రి నుంచి ఎదురైన చేదు అనుభవాలను పేపర్‌పై రాసుకుని మంచం కింద పెట్టుకోవడం బాలికకు అలవాటుగా ఉండేది. బాలిక ఫిర్యాదు అనంతరం ఈ పేపర్ స్టేట్మెంట్స్ నేరస్తుడి వద్ద పోలీసులకు లభించడంతో ప్రాసిక్యూషన్‌కు సహాయపడింది. దీంతో నిందితుడికి ఫాస్ట్రాక్ కోర్టు కఠిన శిక్ష విధించింది.

Tags:    

Similar News