Panama Canal: పనామా కెనాల్‌ను మళ్లీ కంట్రోల్‌లోకి తీసుకుంటాం.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
పనామా కెనాల్‌ను సరైన రీతిలో నిర్వహించకుంటే దానిని మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
దిశ, నేషనల్ బ్యూరో: పనామా కెనాల్ (Panama canal)ను సరైన రీతిలో నిర్వహించకుంటే దానిని మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. కెనాల్ వినియోగానికి పనామా ప్రభుత్వం అధిక రేట్లు వసూలు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. ‘అమెరికా ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత కారణంగా పనామా కెనాల్ యూఎస్‌కు కీలకమైన జాతీయ ఆస్తిగా ఉంది. కానీ ఈ జలమార్గం గుండా ప్రయాణించే యూఎస్ నౌకలకు పనామా ప్రభుత్వం వసూలు చేస్తున్న రుసుములు హాస్యస్పదంగా ఉన్నాయి. పనామా కాలువ ఆపరేషన్ సురక్షితంగా ఉందని నిర్ధారించడంలో పనామా విఫలమైతే దానిని యూఎస్ కంట్రోల్‌లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తాం’ అని పేర్కొన్నారు.
ఈ కాలువను పనామా నిర్వహించడం వల్ల చైనా (China) ప్రభావానికి తలుపులు తెరిచే అవకాశం ఉందని తెలిపారు. ఈ తరహా పరిణామాలు నెలకొంటే అమెరికా జాతీయ, ఆర్థిక ప్రయోజనాలకు ప్రమాదం పొంచి ఉండే చాన్స్ ఉందని పేర్కొన్నారు. కాలువలో చైనా, మరే ఇతర విదేశీ శక్తులు కార్యకలాపాలు చేపట్టకూడదని నొక్కి చెప్పారు. అటువంటి వాటిని నియంత్రించడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. కాలువపై పూర్తి హక్కులు పనామాకే ఉన్నాయని వెల్లడించారు. దానిని ఎవరి చేతుల్లోకి వెళ్లనివ్వబోమని తెలిపారు.
కాగా, పనామా కెనాల్ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. 82 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. ప్రపంచంలోని సముద్ర వాణిజ్యంలో ఆరు శాతం పనామా కాలువ ద్వారానే జరుగుతుంది. అంతేగాక అమెరికా వాణిజ్యంలోనూ 14 శాతం ఈ కాలువ ద్వారానే సాగుతోంది. కాలువ నిర్మాణాన్ని ఫ్రాన్స్ 1881లో ప్రారంభించగా.. దీనిని 1914లో అమెరికా పూర్తి చేసింది. అనంతరం పనామా కాలువపై యూఎస్ నియంత్రణను కలిగి ఉంది. కానీ1999లో ఒక ఒప్పందం ప్రకారం కాలువ నియంత్రణను పనామా ప్రభుత్వానికి అప్పగించింది. దీనిని ఇప్పుడు పనామా కెనాల్ అథారిటీ నిర్వహిస్తోంది. అయితే పనామా కాలువపై చైనా తన ప్రభావాన్ని పెంచుతోందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.