Jagdeep Dhankhar : కోల్‌కతా మెడికల్ కాలేజీ ఘటనపై ఉప రాష్ట్రపతి సంచలన కామెంట్స్

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Update: 2024-09-01 13:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ ఆ దురాగతం గురించి తెలుసుకొని ఆవేదనకు లోనయ్యారని చెప్పారు. ఆదివారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న రాష్ట్రీయ మిలిటరీ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ప్రసంగించారు. కోల్‌కతా మెడికల్ కాలేజీ ఘటన అంత పెద్దదేం కాదు అన్నట్టుగా కొందరు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను జగదీప్ ధన్కర్ తప్పుపట్టారు. అలాంటి వాళ్ల మాటలు విని మానవత్వమే సిగ్గుతో తలదించుకుంటోందన్నారు.

కోల్‌కతా ఘటనను చిన్నదిగా చూపిస్తూ కొందరు రాజకీయ ప్రముఖులు, ఎంపీలు, సీనియర్ అడ్వకేట్లు చేస్తున్న వ్యాఖ్యలు విని ప్రజలు మరింత ఆవేదనకు లోనవుతున్నారని ఉప రాష్ట్రపతి చెప్పారు. ఈ కామెంట్స్‌ చేస్తున్న వాళ్లంతా ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని జగదీప్ ధన్కర్ డిమాండ్ చేశారు. ‘‘ఈ కేసులో బాధిత కుటుంబం తరఫున వాణిని వినిపించాల్సిన స్వచ్ఛంద సంస్థలు మూగబోయాయి. ఇలాంటి అంశాల్లో న్యాయం కోసం గళమెత్తకుండా మౌనంగా ఉండటం అనేది.. ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతం కంటే దుర్మార్గమైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కోల్‌కతా మెడికల్ కాలేజీ కేసులో బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. పరోక్షంగా సిబల్‌ను లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు ఉప రాష్ట్రపతి కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.


Similar News