బాధితులు స్థాయికి మించి మద్యం తాగారు..కళ్లు కురిచి ఘటనపై కమల్ హాసన్

తమిళనాడులోని కళ్లుకురిచిలో కల్తీ మద్యం ఘటనలో బాధితులైన వారిని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ ఆదివారం పరామర్శించారు.

Update: 2024-06-23 16:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కళ్లుకురిచిలో కల్తీ మద్యం ఘటనలో బాధితులైన వారిని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితులు ఆరోగ్యంపై అ జాగ్రత్తగా ఉన్నారని, వారు పరిమితికి మించి మద్యం తాగారని వ్యాఖ్యానించారు. ‘బాధితుల పట్ల సానుభూతి లేదని చెప్పలేను. కానీ బాధితులు తమ స్థాయికి మించి తాగారు. దీనిని బట్టి చూస్తే వారు అజాగ్రత్తగా ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. వారు జాగ్రత్తగా ఉండాలి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అని తెలిపారు. బాధితుల కోసం మానసిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించి కమల్ హాసన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘తమిళనాడులో ఉచితంగా కల్తీ మద్యం లభిస్తోంది. ఈ విషయంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేసే బదులు కమల్ హాసన్ బాధితులను నిందిస్తున్నారు. ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి ఎంతకైనా దిగజారాలి. కమల్ అదే చేశారు. దీనికి ఇండియా కూటమి సమాధానం చెప్పాలి’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా, ఈ నెల19న రాష్ట్రంలోని కళ్లుకురిచిలో కల్తీ మద్యం తాగి 56 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 


Similar News