Shaved Heads : దొంగతనం చేశారనే అనుమానంతో.. గుండు గీయించి ఊరేగించారు

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లా తాజ్‌పూర్ తేడియా గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది.

Update: 2024-10-10 17:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లా తాజ్‌పూర్ తేడియా గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. ముగ్గురు దళిత టీనేజర్లను గుండు గీయించి, మొహానికి మసిపూసి ఊరంతా ఊరేగించారు. ఊరిలో రెండు పౌల్ట్రీ ఫామ్‌లు నడుపుకునే నాజిం, ఖాసిం, సాను, ఇనాయత్ కలిసి ఈ పాశవిక దాడికి తెగబడ్డారు. 12 నుంచి 14 ఏళ్లలోపు వయసు కలిగిన ముగ్గురు టీనేజర్లు వీరి పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసేవారు. అయితే 5 కేజీల గోధుమలను పౌల్ట్రీ ఫామ్‌ల నుంచి దొంగిలించి అమ్ముకున్నారనే అనుమానంతో ఆ ముగ్గురు అబ్బాయిలపై నాజిం, ఖాసింలు కలిసి దాడి చేశారు.

ఎలక్ట్రిక్ వైర్లను బిగించి గొంతును నులిమేందుకు యత్నించారు. అనంతరం గుండు గీయించి, మొహానికి మసిపూసి, మోచేతులపై ‘దొంగ’ అని రాయించి, రెండు చేతులను వెనక్కి కట్టేసి తాజ్‌పూర్ తేడియా గ్రామంలో ఊరేగించారు. దీంతో దీనిపై ముగ్గురు టీనేజర్ల కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత టీనేజర్లు దొంగతనం చేయలేదని.. పౌల్ట్రీ ఫామ్‌‌లలో పనికి వెళ్లడం లేదనే అక్కసుతోనే వారిపై నాజిం, ఖాసిం, సాను, ఇనాయత్ కలిసి దాడి చేశారని పోలీసులకు తెలిపారు. దీంతో దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు.


Similar News