3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల పట్టాలపై విచారణ.. రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇటీవల రాజస్థాన్‌లో నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉదంతం వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2024-07-12 14:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల రాజస్థాన్‌లో నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉదంతం వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో రిక్రూట్ అయిన మూడు లక్షల మంది రాష్ట్ర ఉద్యోగుల నియామక ప్రక్రియలపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. నకిలీ పత్రాల ద్వారా ఇంకా ఎవరైనా ఉద్యోగం సంపాదించి ఉంటారనే అనుమానంతో, 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల పట్టాలపై విచారణ జరిపించనుంది. పరీక్షకు హాజరైన వ్యక్తి, ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఒకరేనా కాదా అని దర్యాప్తు చేయడానికి ప్రతి విభాగం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇటీవల పీటీఐ రిక్రూట్‌మెంట్ పరీక్షను నిర్వహించే రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను విచారించడంతో ఈ నకిలీ డిగ్రీల రాకెట్ బట్టబయలైంది. ఎంపికైన 80 మందికి పైగా అభ్యర్థుల పట్టాలు నకిలీవని తేలింది. వాటిలో 60 సర్టిఫికెట్లను చురులోని ఓం ప్రకాష్ జోగేందర్ సింగ్ (OPJS) యూనివర్సిటీ నుంచి జారీ చేశారు. విచారణలో భాగంగా యూనివర్సిటీ ఇప్పటివరకు 43,000 నకిలీ పట్టాలను పంపిణీ చేసినట్లు తేలింది. జమ్మూ కాశ్మీర్‌, దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇలాంటి నకిలీ పట్టాలను తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


Similar News