పాలిటిక్స్ నుంచి తప్పుకున్న భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్..కారణమిదే?

ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-06-25 18:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘2024 ఎన్నికల ఫలితాల తర్వాత పాలిటిక్స్ నాకు సరిపోవని గ్రహించా. అందుకే తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ‘క్రీడలు, పర్యాటక రంగ అభివృద్ధిపై నాకు గొప్ప ఆలోచనలు ఉన్నాయి. అవకాశం ఇచ్చినప్పుడు, నిజాయితీగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి ఇష్టపడతాను. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు’ అని తెలిపారు. 2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు పిఎస్ తమాంగ్, ఎస్‌కెఎమ్ పార్టీకి అభినందనలు తెలిపారు.

కాగా, 2018 మే 31న భుటియా హంరో సిక్కిం పార్టీని స్థాపించాడు. గతేడాది నవంబర్‌లో చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్‌డిఎఫ్‌లో చేరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నిక్లో ఎస్‌డీఎఫ్ అభ్యర్థిగా బర్ఫుంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే 2016లో సిలిగురి అసెంబ్లీ స్థానం నుంచి కూడా టీఎంసీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. దీంతో వరుస ఓటముల నేపథ్యంలోనే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు తెలుస్తోంది. 


Similar News