PM Modi : ఓ వైపు యుద్ధాలు జరుగుతుంటే..మరోవైపు స్నేహగీతం ఆలపిస్తున్నాం : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: 21వ శతాబ్దం భారత్, ఆసియాన్ దేశాలదేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: 21వ శతాబ్దం భారత్, ఆసియాన్ దేశాలదేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తమవి శాంతి కాముక దేశాలని.. పరస్పరం జాతీయ సమగ్రత, సార్వభౌమాధికారాలను గౌరవించుకుంటామని ఆయన తెలిపారు. భావితరాల కోసం బంగారు భవిష్యత్తును నిర్మించాలనే బలమైన సంకల్పంతో భారత్, ఆసియాన్ దేశాలు ముందుకు సాగుతున్నాయన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోడీ గురువారం ఉదయం లావోస్‌కు చేరుకున్నారు. రాజధాని వియెన్‌టియేన్‌లో జరిగిన 21వ భారత్-ఆసియాన్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో పలుచోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలు తీవ్రరూపు దాలుస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట తరుణంలో ఇండియా -ఆసియాన్ స్నేహబంధం మరింత బలోపేతం అవుతుండటం గొప్ప విషయం’’ అని మోడీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర జలాల్లో చైనా దూకుడుకు కళ్లెం వేయడంపై భారత ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర జలాల్లో గతేడాది సైనిక విన్యాసాలు చేశాం. ప్రాంతీయ సుస్థిరత, భద్రత కోసం మేమంతా కలిసికట్టుగా ఉంటాం’’ అని మోడీ స్పష్టం చేశారు. ఆసియాన్ దేశాలతో భారత్ వాణిజ్యం గత పదేళ్లలో రెట్టింపై రూ.10 లక్షల కోట్లకు చేరిందన్నారు.
2025 ఆసియాన్ - భారత్ పర్యాటక సంవత్సరం
ఆసియాన్ ప్రాంతంలోని దేశాలతో భారత్ సంబంధాల బలోపేతానికి 10 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను భారత ప్రధాని ప్రకటించారు. యువజన సదస్సులు, స్టార్టప్ ఫెస్టివల్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్, హ్యాకథాన్, ఆసియాన్-ఇండియా మహిళా సైంటిస్టుల సదస్సు, ఆసియాన్-ఇండియా పరిశోధనా సంస్థల సదస్సు, ఢిల్లీ డైలాగ్ వంటి వాటి ద్వారా సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. భారత్‌లోని నలందా యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలలో చేరే ఆసియాన్ దేశాల విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లను రెట్టింపు చేస్తామని మోడీ తెలిపారు. ఆసియాన్-భారత్ సరుకు రవాణా ఒప్పందంపై 2025 కల్లా సమీక్షిస్తామని చెప్పారు. 2025ను ఆసియాన్ - భారత్ పర్యాటక సంవత్సరంగా మోడీ ప్రకటించారు. ఇందుకోసం ఉమ్మడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత్ తరఫున రూ.41 కోట్లు అందిస్తామని ఆయన వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ‘అమ్మ కోసం ఒక మొక్క నాటండి’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆసియాన్ దేశాల నేతలకు మోడీ పిలుపునిచ్చారు.
‘ఫ్ర లాక్ ఫ్రా రామ్’ నాటికను వీక్షించిన మోడీ
లావోస్ దేశపు జాతీయ ఇతిహాసం పేరు ‘ఫ్ర లాక్ ఫ్రా రామ్’. భారత్‌కు చెందిన రామాయణ గాథనే అక్కడ ‘ఫ్ర లాక్ ఫ్రా రామ్’ అని పిలుస్తుంటారు. వియెన్‌టియేన్ నగరంలో రామాయణంపై ప్రదర్శించిన నాటికలోని ఒక ఎపిసోడ్‌ను ప్రధాని మోడీ వీక్షించారు. అంతకుముందు లావోస్ రాజధానికి చేరుకోగానే భారత ప్రధానికి, లావోస్ ప్రధాన మంత్రి సోనెక్సే సిపాండన్ ఘన స్వాగతం పలికారు. వియెన్‌టియేన్ ఎయిర్‌పోర్టులో లావోస్ విద్యార్థులు, భారత సంతతి విద్యార్థులు కలిసి గాయత్రీ మంత్రం చదువుతూ మోడీకి ఆహ్వానం పలికారు. పలువురు ప్రవాస భారతీయులు ఎయిర్‌పోర్టులో భారత ప్రధానిని ఆప్యాయంగా పలకరించారు. లావోస్‌లోకి ఘన స్వాగతం పలికారు.