నీటి సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఢిల్లీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది

Update: 2024-05-31 06:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఢిల్లీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నగరంలో ఏర్పడిన నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుండి ఒక నెల పాటు అదనపు నీటిని సరఫరా చేసేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడి గాలుల ప్రభావంతో నీళ్లు అడుగంటిపోయాయి, ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుని ఆయా రాష్ట్రాల నుంచి ఒక నెల పాటు నీటి సరఫరా జరిగేలా చూడాలని ఢిల్లీ తన పిటిషన్‌లో పేర్కొంది.

అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వాలతో బీజేపీ అధినాయకత్వం మాట్లాడి ఢిల్లీకి ఒక నెల నీరు ఇచ్చేలా చూడాలని, అలా చేస్తే బీజేపీ చర్యను నగర ప్రజలు అభినందిస్తారని ఎక్స్‌లో అన్నారు. ప్రస్తుతం నగరంలో ప్రజలు నీటి ట్యాంకుల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోకి వాటర్ ట్యాంకర్ వచ్చిన వెంటనే భారీగా జనం గుమిగుడుతూ నీళ్ల కోసం ఎగబడుతున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం నీటి వృధాను అరికట్టడానికి కీలక చర్యలు ప్రారంభించింది. బుధవారం నుంచి నీటి వృధా చేసే వారిపై రూ.2,000 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే, పరిశీలన కోసం ప్రత్యేకంగా 200 బృందాలను ఏర్పాటు చేసింది. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. నగరంలో హీట్‌వేవ్ పరిస్థితులు రాబోయే కొద్ది రోజులు కొనసాగుతాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Similar News