ముగిసిన ప్రధాని 45 గంటల సుదీర్ఘ ధ్యానం

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద సుదీర్ఘ ధ్యానం చేసిన ప్రధాని మోడీ తన ధ్యానాన్ని ముగించారు.

Update: 2024-06-01 11:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద సుదీర్ఘ ధ్యానం చేసిన ప్రధాని మోడీ తన ధ్యానాన్ని ముగించారు. మే 30న సాయంత్రం నుంచి జూన్ 1 వరకు దాదాపు 45 గంటల పాటు ఆయన ధ్యానం చేశారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకున్నారు. గురువారం మొదలైన ఈ ఆధ్యాత్మిక యాత్ర శనివారం ముగిసింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం మోడీ, తమిళ సాధువు-కవి తిరువల్లువర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఏడు దశల ఎన్నికల పోలింగ్ ప్రచారం ముగిసిన తరువాత పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించి మోడీ ధ్యానం చేయడానికి వివేకానంద రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు. కన్యాకుమారి వెళ్లడం ద్వారా ప్రధాని మోదీ దేశ సమైక్యతను చాటుతున్నారని అధికార బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. మోడీ ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 75 రోజుల్లో 206 ర్యాలీలు, రోడ్‌షోలను నిర్వహించారు. అలాగే వివిధ వార్త పత్రికలకు, పలు మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు దాదాపు 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు.

ఇదిలా ఉంటే, మోడీ ధ్యానంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. మోడీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని అవి ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలకు శ్రీకారం చుట్టడం ఇది తొలిసారి కాదు, అంతకుముందు 2019లో కేదార్‌నాథ్‌, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశలుగా ప్రారంభమైన ఎన్నికలు శనివారం జూన్ 1తో ముగిశాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.


Similar News