లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లా నేపథ్యమిదే!

18వ లోక్ సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కోడికున్నిల్ సురేశ్ పై విజయం సాధించారు.

Update: 2024-06-26 14:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 18వ లోక్ సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కోడికున్నిల్ సురేశ్ పై విజయం సాధించారు. మూడో రోజు సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా పేరును ప్రధాని మోడీ ప్రతిపాదించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సహా ఎన్డీయే నేతలు దీనికి మద్దతు తెలిపారు. ఇండియా కూటమి తరఫున కొడికున్నల్ సురేశ్ పేరును శివసేన (యూటీబీ) ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా..పలువురు ప్రతిపక్ష నేతలు బలపరిచారు. అనంతరం మూజువాణి విధానంలో ఓటింగ్ చేపట్టి..స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్‌ మహతాబ్‌ ప్రకటించారు. ఆ తర్వాత పీఎం మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు బిర్లాను స్పీకర్ కుర్చీలో కూర్చొబెట్టి అభినందనలు తెలిపారు. కాగా, బిర్లా స్పీకర్‌గా ఎన్నికవడం ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. గత ప్రభుత్వంలోనూ 17వ లోక్ సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

రెండు సార్లు పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా రికార్డు

లోక్ సభ స్పీకర్ పదవిని వరుసగా రెండు సార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా రికార్డు సృష్టించారు. అంతకన్నా ముందు ఏంఏ అయ్యంగార్, జీఎస్ థిల్లాన్, నీలం సంజీవరెడ్డి, జీఎంసీ బాలయోగిలు వరుసగా రెండు సార్లు స్పీకర్ పదవికి ఎన్నికయ్యారు. అయితే వీరెవరూ కూడా పదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయకపోవడం గమనార్హం. ఆయా కారణాల వల్ల వారు స్పీకర్‌గా వైదొలగాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం స్పీకర్‌గా ఎన్నికైన బిర్లా పదేళ్లు పూర్తి చేస్తే ఆ పదవి సుదీర్ఘకాలం చేపట్టిన వ్యక్తిగా మరో ఘనత సాధించనున్నాడు.

బిర్లా నేపథ్యం

అత్యంత రాజకీయ అనుభం కలిగిన బిర్లా 1962 నవంబర్ 23న రాజస్థాన్ లోని కోటాలో జన్మించారు. అజ్మీర్‌లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. బీజేపీలో చేరిన ఆయన 1991–1997వరకు రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 1997 నుంచి 2003 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2003లో కోటా సౌత్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే కోటా పార్లమెంటు నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే 17వ, 18వ లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

సభ అదృష్టం: బిర్లాపై మోడీ ప్రశంసలు

లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోడీ అభినందించారు. ఆయన స్పీకర్‌గా ఎన్నికవ్వడం సభ అదృష్టమని కొనియాడారు. ‘సభ తరపున మీకు శుభాకాంక్షలు. అమృతకాలంలో రెండోసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఈ పదవి ఒక పెద్ద బాధ్యత. మీ అనుభవంతో మార్గదర్శకత్వం వహిస్తారని ఆశిస్తున్నాం. మీ మధురమైన నవ్వు.. మొత్తం సభను సంతోషంగా ఉంచుతుంది’ అని వ్యాఖ్యానించారు.స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో జరగని పనులు ఓం బిర్లా అధ్యక్షతన సభ ద్వారా సాధ్యమయ్యాయన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. విపక్షాలు మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు.

ఎంపీల సస్పెన్షన్ జరగదని ఆశిస్తున్నా: అఖిలేష్ యాదవ్

లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైన తర్వాత సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 18వ లోక్ సభలో ఎంపీల సస్పెన్షన్ వంటి చర్యలు ఉండబోవని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని.. అధికార పార్టీతో సహా సమాన అవకాశాలు ఇస్తారని నమ్ముతున్నానన్నారు. ఏ ప్రజాప్రతినిధుల గొంతు నొక్కకూడదని సస్పెన్షన్ లాంటి చర్యలు మళ్లీ జరగబోవని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా వంద మంది ఎంపీల సస్పెన్షన్ అయ్యారు. దాన్ని ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ పరోక్షంగా ప్రస్తావించడం గమనార్హం.


Similar News