Terrorists: కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. కథువాలో ఎదురు కాల్పులు
జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని కథువా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. జుతానా (Juthaana) ప్రాంతంలో పలువురు ఉగ్రవాదులున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా బలగాలు గురువారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టెర్రిరిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఐదురుగు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు పాల్గొన్నాయి. అయితే కథువా ప్రాంతంలోని సన్యాల్ అడవిలో ఇటీవల ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.