పదేళ్ల ఎన్డీఏ పాలన కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా ఉంది: ప్రధాని మోడీ
కేరళతో పాటు దేశానికి, దేశ పురోగతికి ఇంకా చేయాల్సి ఉందని మోడీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: గడిచిన దశాబ్ద కాలంలో ఎన్డీఏ పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శొమవారం కేరళలోని కున్నంకుళంలో పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన మోడీ, కేరళతో పాటు దేశానికి, దేశ పురోగతికి ఇంకా చేయాల్సి ఉందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమికి దక్షిణాది రాష్ట్రాల నుంచి మరింత మద్దతు కావాలని అభ్యర్థించారు. కేరళలో ఇది అభివృద్ధి సంవత్సరం అవుతుందని, ఆదివారం విడుదల చేసిన మోడీ కి గ్యారెంటీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు, వాగ్దానాలను ప్రస్తావించారు. ఇదే సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోడీ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ యూపీలో తమ కుటుంబానికి చెందిన స్థానాన్ని కాపాడుకోలేక మౌనంగా ఉన్నారని, అలాగే కరువనూరు బ్యాంకు కుంభకోణంపై మాట్లాడ్డంలేదని ఆరోపణలు చేశారు. నేరుగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా కాంగ్రెస్ యువరాజు తమ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోలేకపోయారని మోడీ అన్నారు. కేరళ ప్రజల ఓట్లు అడుగుతాడు కానీ, వారి ప్రయోజనాల కోసం గొంతెత్తడు. ఇదే సమయంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలని మోడీ అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం భారత వృద్ధిని ఎలా పెంచిందో ప్రజలు చూశారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు భారత్‌ను బలహీన దేశంగా మార్చాయని, ఆ ముద్రను బీజేపీ తొలగించిందన్నారు.