స్టార్ క్యాంపెయినర్ల తీరుపై ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు ఈసీ నోటీసులు
బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సరళిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో:బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సరళిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారంలో కుల, మత ప్రస్తావనలను తీసుకురావడంపై కన్నెర్ర చేసింది. ఈ మేరకు స్టార్ క్యాంపెయినర్ల తీరు మార్చుకొనేలా సూచించుకోవాలని ఆదేశిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు ఈసీ బుధవారం నోటీసులు జారీ చేసింది. రాజకీయ ప్రచారంలో భాగంగా ఆరోపణలు ప్రత్యారోపణల కారణంగా ఎన్నికల వ్యవస్థపై భారత ఓటరుకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ఈసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేసింది. ప్రచారంలో భాగంగా మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ లను హెచ్చరించింది. సమాజంలో విభజనకు దారి తీసే ప్రసంగాలను ఆపాలని బీజేపీకి స్పష్టం చేయగా రాజ్యాంగం రద్దు అవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ ను ఆదేశించింది. అలాగే అగ్నివీర్ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు సాయుధ బలగాలను రాజకీయం చేయవద్దని సూచించింది. పరస్పర ఆరోపణల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఈ విషయంలో అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు మినహాయింపు లేదని పేర్కొంది.