కూతురు వ్యభిచారం చేస్తుందని ఫోన్ కాల్.. ఆ తర్వాత టీచర్ కు..

కూతురు వ్యభిచారంలో అరెస్టైందని వచ్చిన ఒక ఫేక్ కాల్ కారణంగా ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించింది. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.

Update: 2024-10-04 05:09 GMT

దిశ, వెబ్ డెస్క్: కూతురు వ్యభిచారం చేస్తోందని, దాడులలో తాము ఆమెను అరెస్ట్ చేశామంటూ ఒక ఫేక్ పోలీస్ మల్తీవర్మ అనే మహిళకు ఫోన్ చేసి చెప్పాడు. సెప్టెంబర్ 30న అతను ఫోన్ లో విషయం చెప్పి.. తనకు లక్ష రూపాయలు ఇస్తే కూతురిని వదిలేస్తానని చెప్పాడు. లేదంటే తాను తీసిన అసభ్యకర వీడియోను లీక్ చేస్తానని బెదిరించాడు. మల్తీవర్మకు గుండెపోటు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో మల్తీవర్మ టీచర్ గా పనిచేస్తోంది. స్కూల్ లో ఉండగానే తనకు ఫోన్ కాల్ రాగా.. ఈ విషయాన్ని కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది.

కొడుకు దివ్యాన్ష్ కు విషయం చెప్పి.. తనకు ఫోన్ కాల్ వచ్చిన నంబరుకు వెంటనే డబ్బు పంపాలని అడగింది. ఆ ఫోన్ నంబర్ ను చూసిన దివ్యాన్ష్.. అది పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు గుర్తించాడు. తల్లికి నువ్వేం కంగారు పడొద్దు. అది ఫేక్ కాల్ అని, పాకిస్తాన్ నుంచి ఎవరో పోలీస్ అధికారి పేరుతో బెదిరిస్తున్నాడని, ఇదంతా ఒక స్కామ్ అని చెప్పాడు. వెంటనే కాలేజీలో ఉన్న తన సోదరికి ఫోన్ చేసి కూడా మాట్లాడానని దివ్యాన్ష్ వెల్లడించాడు. తన సోదరి కుశలంగానే ఉందని చెప్పినా.. తన తల్లి ఆరోగ్యం కుదుటపడలేదని, మరింత క్షీణించిందని వాపోయాడు.

తన తల్లి స్కూల్ నుంచి తిరిగి వచ్చాక.. సాయంత్రం అలసటగా కనిపించిందన్నాడు. అస్వస్థతకు గురవ్వగా.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లానని, కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారన్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. గుండెపోటుకు గురైన మహిళను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కూతురు గురించి ఫేక్ కాల్ రావడంతో మహిళ ఆందోళనకు గురై చనిపోయిందని, ఇదొక డిజిటల్ అరెస్ట్ అని పేర్కొంది. సొసైటీలో ఇలాంటి కేసులు పెరిగిపోయాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సైబర్ నేరస్తులు నిరంతరం ప్రజలకు హాని చేస్తున్నారని, వీటిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ X వేదికగా ట్వీట్ చేసింది. 


Similar News