Piyush Goyal: పరిశ్రమల అభివృద్ధిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
దేశీయ పరిశ్రమల అభివృద్ధి గురించి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ పరిశ్రమల అభివృద్ధి గురించి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని పరిశ్రమలపై చైనా ప్రభావానికి దేశంలోని కొందరు వ్యక్తులే కారణమని విమర్శించారు. వారు చైనాను ప్రశంసిస్తూనే వెనకేసుకొస్తూనే ఉన్నారని కాంగ్రెస్ ని ఉద్దేశించి నిప్పులు చెరిగారు. ‘‘చైనా తయారుచేసే నాసిరకమైన, అపారదర్శక వస్తువులను భారత్‌కు పెద్దమొత్తంలో ఎగుమతికి గత కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతినివ్వడం సిగ్గుచేటు. దీనివల్ల భారత మార్కెట్లు అభివృద్ధి చెందకుండా వారు అడ్డుకున్నారు’’ అని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చైనా తీరు సరిగా లేదని ప్రపంచమంతా విమర్శిస్తోందని గుర్తుచేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై స్పందన
గత నెలలో తన అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైనా పీయూష్ గోయల్ స్పందించారు. రాహుల్ గాంధీ దేశ రాజకీయాలను విదేశీ గడ్డపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. చైనా వస్తువులను భారత్‌లో పెద్ద మొత్తంలో చేయడం వల్ల ఇక్కడి పరిశ్రమలు తయారుచేసిన వస్తువులకు డిమాండ్ లేకుండాపోయిందన్నారు. దీంతో దేశంలో నిరుద్యోగం పెరిగింది. అప్పట్లో కాంగ్రెస్ చేసిన పని వల్ల నిరుద్యోగం పెరిగిందన్న విషయం గుర్తుకు వచ్చే రాహుల్ అమెరికాలో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారేమో తెలియదని చురకలు అంటించారు. కానీ. తాము ఆయనలా విదేశాల్లో స్వదేశం పరువును తీసేలా ఎప్పటికీ ప్రవర్తించమన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన, సుసంపన్నదేశంగా తయారుచేయడమే తమ లక్ష్యమని పీయూష్ గోయల్ అన్నారు. అంతేకాకుండా, చైనా వస్తువులపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తంచేస్తోందని పేర్కొన్నారు. అందువల్లే చైనా వస్తువులపై అదనపు పన్నులు, సుంకాలు విధిస్తోందని చెప్పుకొచ్చారు. వాటినుంచి భద్రతా ముప్పు పొంచి ఉందని చెప్పారు.