ఢిల్లీ డాక్టర్ హత్యకేసు నిందితుడు అరెస్ట్.. సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్

ఢిల్లీలో 55 ఏళ్ల వైద్యుడిని చంపిన నిందితుల్లో ఒకరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వైద్యుడిని ఎందుకు చంపారో, ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.

Update: 2024-10-04 06:20 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని కలింది కుంజ్ లో ఉన్న నీమా నర్సింగ్ హోమ్ లో 55 ఏళ్ల వైద్యుడు జావేద్ అక్తర్ హత్య కలకలం రేపింది. అక్కడికి చికిత్స కోసం వచ్చిన ఇద్దరు యువకులు వైద్యుడిని చంపారని గుర్తించిన పోలీసులు.. వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలోనే ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీసులు మీడియాకు వెల్లడించారు.

గురువారం (అక్టోబర్ 3)న 17 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని టీనేజ్ స్నేహితుడితో కలిసి నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, హత్య తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడని వెల్లడించారు. మొత్తానికి 2024లో తాను హత్య చేశానని అతని ఫొటోతో సహా ఆ పోస్ట్ లో పేర్కొన్నాడని చెప్పారు. విచారణలో వైద్యుడిని చంపడానికి గల కారణమేంటో నిందితుడు వెల్లడించాడన్నారు.

వైద్యుడి హత్యకు ముందురోజే వారు ట్రీట్మెంట్ చేయించుకున్నారని, గాయాలతో వచ్చిన తనకు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు.. ఫీజు ఎక్కువగా తీసుకున్నాడన్న కోపంతోనే చంపేసినట్లు చెప్పాడని వివరించారు. హత్య చేసిన ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివాసం ఉంటారని గుర్తించామన్నారు. హత్యకు ఉపయోగించిన గన్ ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య సమయంలో నర్సింగ్ హోమ్ లోనే ఉన్న నర్సును కూడా.. ఆమె భర్తకు ఈ హత్యతో సంబంధం ఉందన్నదానిపై ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో టీనేజర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Similar News