తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళ ఎంపీ

తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాధ్ లోక్‌సభలో మంగళవారం తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-06-25 09:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాధ్ లోక్‌సభలో మంగళవారం తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు కుటుంబానికి చెందిన గోపీనాధ్ తన పూర్వీకులు హోసూరులో స్థిరపడడంతో తెలుగునే మాతృభాషగా భావిస్తున్నారు. అక్కడి ప్రజల్లో తెలుగువారు గణనీయంగా ఉంటున్నందున వారితో సమస్యలు, పరిష్కారాల విషయంలో తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. తమిళనాడులో ఉన్నందున తమిళ ప్రజలతో వారి భాషలోనే మాట్లాడుతారు. తెలుగు భాషపై ఎక్కువ ఆసక్తికలిగిన ఆయన గతంలో (2001, 2006, 2011) ఎమ్మెల్యేగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తొలిసారి కృష్ణగిరి నుంచి ఎంపీగా గెలవడంతో తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకుని ముందుగానే సెక్రటరీ జనరల్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన కోరిక మేరకు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు.

గతంలో హోసూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తన నియోజగవర్గానికి సంబంధించిన అనేక అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో తెలుగులోనే ప్రస్తావించేవారు. 2001, 2011 ఎన్నికల్లో హోసూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆయన లేవనెత్తిన అంశాలకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత తెలుగులోనే సమాధానం చెప్పారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలకు ఆయన అడిగిన ప్రశ్న, జయలలిత ఇచ్చిన సమాధానం అర్థం కాకపోవడంతో రెండింటినీ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో జయలలితే తమిళంలోని అనువదించి అర్థం చేయించారు. మొదటి నుంచీ తెలుగు భాషపై ఆసక్తి ఉన్న గోపీనాధ్ లోక్‌సభ సభ్యుడిగా తెలుగులోనే రాజ్యాంగం ప్రతిని చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.


Similar News