Maharashtra: ఎన్సీపీలో చేరేందుకు రూ. కోటి ఆఫర్ చేశారు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ
మహారాష్ట్ర ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అజిత్ పవార్ (Ajith pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరేందుకు తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఆఫర్ చేశారని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్‌చార్జ్ రమేశ్ చెన్నితాల (Ramesh chennithala) ఆరోపించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్సీపీలో చేరేందుకు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుంది. హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ విషయంపై ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది’ అని వ్యాఖ్యానించారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరపూరిత చర్యలేనని తెలిపారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ఎన్సీపీ స్పందించలేదు. కాగా, మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రచారాన్ని వేగవంతం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.