Taliban: ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. తాలిబన్ మంత్రి మృతి

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో తాలిబన్ శరణార్థుల మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ మరణించారు.

Update: 2024-12-11 14:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ఘనిస్థాన్ (Afganisthan) రాజధాని కాబూల్‌లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో తాలిబన్ శరణార్థుల మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ (Khalil Rahman Haqqani) మరణించారు. మంత్రిత్వ శాఖ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ దాడిలో హక్కానీ సహా ఆయనకు సెక్యురిటీగా ఉన్న నలుగురు వ్యక్తులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు జరిగినప్పుడు హక్కానీ కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నారని అందువల్ల ఈ దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పలు కథనాలు వెల్లడించాయి. హక్కానీ మరణాన్ని ఆయన మేనల్లుడు అనాస్ హక్కానీ (Anas hakkanee) ధ్రువీకరించారు. ‘మేము చాలా ధైర్యమైన ముజాహిద్‌ను కోల్పోయాం’ అని పేర్కొన్నారు.

ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. అయితే ఉగ్రవాద సంస్థ ఐసిస్-కే(ISIS-k) దాడికి పాల్పడి ఉంటుందని కథనాలు పేర్కొన్నాయి. పేలుడుకు కారణమెవరో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని తాలిబాన్ అధికారులు వెల్లడించారు. దీనిని ఆత్మాహుతి దాడిగా నిర్థారించారు. హక్కానీ లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ దాడి జరిగిందా లేక మరెవరినైనా టార్గెట్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఖలీల్ హక్కానీ తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు. అతను హక్కానీ నెట్‌వర్క్‌కు సీనియర్ నాయకుడు. 20 ఏళ్ల యుద్ధంలో భారీ దాడులకు సూత్రధారిగా ఉన్నారు.

Tags:    

Similar News