కాంగ్రెస్ దోచుకున్న డబ్బును పేదలకు తిరిగిచ్చే దానిపై న్యాయ సలహా: ప్రధాని మోడీ
అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ కుటుంబానికి ఎందుకు సన్నిహితంగా ఉన్నారని ప్రశ్నించారు.
దిశ, నేషనల్ బ్యూరో: అవినీతి చేసి దోచుకున్న పేదల సొమ్మును తిరిగిచ్చే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో హౌస్‌కీపర్ ఇంట్లో దొరికిన రూ. 20-30 కోట్ల సొమ్మును ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని ప్రస్తావించిన మోడీ, అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ కుటుంబానికి ఎందుకు సన్నిహితంగా ఉన్నారని ప్రశ్నించారు. వారు ఓ వర్కర్ ఇంటిని అవినీతి గౌడౌన్‌గా మార్చారు. ఇంతకుముందు కూడా ఒక ఎంపీ(జార్ఖండ్) నుంచి పెద్ద మొత్తం సీజ్ చేశారు. నగదు లెక్కించే మెషీన్లు సైతం అలసిపోయేంత నగదు పట్టుబడుతోందని మోడీ ఎద్దేవా చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని వేమగిరిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఎవరి నుంచి డబ్బు గుట్టలు గుట్టలుగా రికవరీ అవుతుందో వారు కాంగ్రెస్ కుటుంబానికి సన్నిహితంగా ఎందుకు ఉన్నారు? పట్టుబడిన నగదు ఎక్కడికో సరఫరా చేయడానికేనా? కాంగ్రెస్ కుటుంబం నల్లధన గోదాములను ఏర్పాటు చేసిందా? వీటికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని మోడీ అన్నారు. ఈ కాంగ్రెస్ అవినీతిపరులు ఎవరి డబ్బును దోచుకున్నారో వారికి తిరిగిచ్చే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నానని మోడీ పేర్కొన్నారు.