కోర్టులోనే ఏడ్చేసిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్

విచారణ సందర్భంగా ఎంపీ స్వాతి మలివాల్ ఈ కేసులో బిభవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సెక్షన్లపై అభ్యంతరం తెలిపారు.

Update: 2024-05-27 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన ఎంపీ స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఓ యూట్యూబర్ తనను బెదిరిస్తునట్టు కోర్టుకు చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. బిభవ్‌ కుమార్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఎంపీ స్వాతి మలివాల్ ఈ కేసులో బిభవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సెక్షన్లపై అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో ఐపీసీ 308 కింద కేసు నమోదు చేసినా ప్రయోజనం లేదన్నారు.

బిభవ్ కుమార్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. సీఎం నివాసంలో సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో దాడి జరిగిందని ఎంపీ చెబుతున్నారు. అక్కడ రికార్డింగ్ పరికరాలు లేవనే విషయం ఆమెకు తెలుసు. మే 13న ఆమె అనుమతి లేకుండా సీఎం ఇంట్లోకి వెళ్లడం అతిక్రమణ కిందకే వస్తుందని వివరించారు. ఎంపీ అయినంత మాత్రాన సీఎం ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లేందుకు వీలవదన్నారు. ఇదే సమయంలో తనపై ఆరోపణలను విని ఎంపీ స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆమె తన వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి తనను బీజేపీ ఏజెంట్‌గా ప్రచారం చేస్తున్నారు. ఆప్‌కు చెందిన వారు తనను వేధిస్తున్నారు. వరుస ప్రెస్‌మీట్లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. బిభవ్ కుమార్ సాధారణ వ్యక్తి కాదని, బిభవ్ కుమార్‌కు బెయిల్ వస్తే తనతో పాటు తన కుంటుంబానికి కూడా ప్రమాదమని ఆమె వివరించారు. గతంలోనూ ఆప్ వాలంటీర్‌గా పనిచేసిన యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తన గురించి వీడియో చేయడంతో తనను అత్యాచారం, హత్య చేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయన్నారు. ఇదే సమయంలో బిభవ్ చెబుతున్నదే నిజమైతే, ఆమె సీఎం నివాసంలోకి చొరబడి నిబంధనలు అతిక్రమిస్తే అప్పుడే ఎందుకని ఫిర్యాదు చేయలేదంటూ స్వాతి మలివాల్ న్యాయవాది ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసు కౌన్సిల్ సైతం కేజ్రీవాల్ తనను డ్రాయింగ్ రూమ్‌లో వెయిట్ చేయమని చెప్పినప్పుడు, నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుందని సందేహం వ్యక్తం చేసింది. ఇరు పార్టీల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను రిజర్వ్‌లో ఉంచింది.

అందరి కాల్ రికార్డ్స్‌పై విచారణ చేయాలి: ఎన్‌సీడబ్ల్యూ

స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా సంబంధిత వ్యక్తుల కాల్ డీటైల్ రికార్డ్స్(సీడీఆర్)పై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్(ఎస్‌సీడబ్ల్యూ) సోమవారం డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలివాల్ వెళ్లిన తర్వాత బిభవ్ కుమార్ పిలిచినట్టు తమకు తెలిసింది. అలాంటపుడు బిభవ్ కుమార్ ఎవరి ఆదేశాలతో పిలిచారనేందుకు కాల్స్ రికార్డ్స్‌పై దర్యాప్తు అవసరమని కమిషన్ పేర్కొంది. అలాగే, మహిళా ఎంపీని అత్యాచారం, హత్య బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

Tags:    

Similar News