జాబ్స్‌కు ‘ఇద్దరు పిల్లల’ రూల్ కరెక్టే : సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదని రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది.
దిశ, నేషనల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదని రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నిబంధనలో వివక్ష కానీ.. రాజ్యాంగ ఉల్లంఘన కానీ లేదని స్పష్టం చేసింది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ‘రాజస్థాన్ వేరియస్ సర్వీస్ (సవరణ) రూల్స్ - 2001’ చెబుతోంది. మాజీ సైనికుడు రామ్‌జీ లాల్ జాట్‌కు 2002 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. 2017లో మిలిటరీ నుంచి పదవీ విరమణ చేసిన ఆయన.. 2018 మే 25న రాజస్థాన్ పోలీస్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు. అయితే ఆయన జాబ్ అప్లికేషన్‌ను అప్పట్లో రెజెక్ట్ చేశారు. దీనిపై రామ్‌జీ లాల్ జాట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల్లో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ.. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో రామ్‌జీ లాల్ జాట్ సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీన్ని విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కూడా రామ్‌జీ లాల్ జాట్ వాదనను తోసిపుచ్చింది. ‘‘ఇద్దరికి మించి పిల్లలను కలిగి ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పించకపోవడం అనేది వివక్షాపూరిత అంశం కాదు. ఈ నిబంధన వెనుక కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమనే లక్ష్యం దాగి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.