Supreme Court: తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం సంచలన తీర్పు

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.

Update: 2024-10-04 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) లడ్డూ కల్తీ వ్యవహరంపై విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీయాలని ఇటీవలే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి (Subramanya Swamy), వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Redd), ఇతరులు సుప్రీం కోర్టులో (Supreme Court) పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు శుక్రవారం మరోసారి ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai), జస్టిస్ కేవీ విశ్వనాథన్ (Justice KV Viswanathan) ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ (TTD) తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ( Siddharth Luthra) వాదనలు వినిపించగా.. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి (Subramanya Swamy) కోర్టుకు స్వయంగా తన వాదనలు వినిపించారు.

ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత (Solicitor General Tushar Mehta), వైసీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సొలిసొటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని వెల్లడించారు. అయితే, అందులో కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని ధర్మాసనం దృష్టి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కోర్టులో కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం చంద్రబాబు (CM Chandrababu) శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీపై జరిగిందంటూ ప్రకటన చేశారని కోర్టుకు తెలిపారు. ఈ వివాదం కోర్టులో ఉండగానే నిన్న కూడా ఆ రాష్ట్రానికి చెందిన ఓ నాయకుడు ఇదే వివాదంపై మాట్లాడారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

అనంతరం సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) మాట్లాడుతూ.. భక్తుల మనోభావానలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జరిగిన ఘటనపై వెంటనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసిందని తెలిపారు. ఈ విషయంలో తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తోనే దర్యాప్తు చేయించాలనుకుంటున్నామని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో ధర్మాసనం కలుగజేసుకుని స్వతంత్ర దర్యాప్తునకు ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించింది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే మంచిదని.. అప్పుడే అందులో రాజకీయ జోక్యం ఉండదని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాటే చేయబోయే కొత్త సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్రం ఏర్పాటు చేసిన సిట్ నుంచి ఇద్దరు ఉంటారని పేర్కొన్నారు. అదేవిధంగా FASSAI నుంచి కూడా ఓ నిపుణుడిని కూడా సిట్‌లో భాగస్వామిగా చేయాలన్నారు. ఆ మొత్తం స్వతంత్ర సిట్‌ను సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సూపర్‌వైజ్ చేస్తారని.. ఇందులో ఎలాంటి రాజకీయ డ్రామాలు ఉండకూడదని జస్టిస్ బీఆర్ గవాయ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని ఆయన సీరియస్ అయ్యారు. కోట్లాది భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది.    


Similar News