Hemanth soren: సీఎం పదవికి హేమంత్ సోరెన్ రిజైన్.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు అప్పుడే?
జార్ఖండ్‌లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 28న హేమంత్ సోరెన్ (Hemanth soren) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ భేటీలో హేమంత్ సోరెన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాజ్ భవన్‌కు వెళ్లిన సోరెన్ గవర్నర్ (Governar)తో భేటీ అయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేసి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిపారు.
జార్ఖండ్ నూతన రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత వరుసగా రెండో సారి ఒకే ప్రభుత్వం ఏర్పడటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రభుత్వం మారగా ఇప్పుడు జేఎంఎం నేతృత్వంలోని కూటమికే ప్రజలు వరుసగా రెండోసారి విజయాన్ని కట్టబెట్టారు. అంతేగాక వరుసగా రెండో సారి సీఎంగా ఎన్నికైన తొలి నేతగా హేమంత్ సోరెన్ రికార్డు సృష్టించనున్నారు. కాగా, 81 మంది శాసనసభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి 56 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.