Constitution Day : ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేక ప్రోగ్రామ్
రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 26న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 26న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu), ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhad), ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) హాజరు కానున్నారు. పాత పార్లమెంట్ భవనం సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్‌లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiran Rijuju) ఆదివారం ఢిల్లీలో ప్రకటించారు. ఆ భవనంలోనే రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా..1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
26న జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో సంస్కృతం, మైథిలి భాషల్లో రాజ్యాంగం ప్రతులతో పాటు ఒక స్మారక నాణాన్ని, ఒక స్టాంపును విడుదల చేయనున్నారు. రాజ్యాంగంలోని చిత్రాలకు అంకితం చేసిన ఒక బుక్‌లెట్‌తో పాటు 'మేకింగ్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ ఎ గ్లింప్స్'(Making of the Constitution A Glimpse), 'మేకింగ్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ అండ్ ఇట్స్ గ్లోరీ'(Making of the Constitution and its Glory) అనే రెండు గ్రంథాలను కూడా ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి ముర్ముతో పాటు దేశ, విదేశాల్లోని ప్రజలు కూడా రాజ్యాంగం పీఠికను చదివి వినిపిస్తారని రిజిజు తెలిపారు.