Clashes: యూపీలోని సంభాల్‌లో హింస.. ముగ్గురు యువకులు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మసీదు సర్వే విషయంలో హింస చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా(Sambhal distric)లో మసీదు సర్వే విషయంలో హింస చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టు ఆదేశాల మేరకు సంభాల్‌లోని మొఘల్ కాలం నాటి జామా మసీదు(Jama mosque)ను రీ సర్వే చేసేందుకు పలువురు అధికారులతో కూడిన బృందం ఆదివారం మసీదుకు వచ్చింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న స్థానిక ముస్లింలు అక్కడికి చేరుకుని సర్వేను వ్యతిరేకించారు. మసీదు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులను చెదర గొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ముగ్గురు యువకులు మరణించగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
మృతి చెందిన వారిని నయీమ్, బిలాల్, నిమాన్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు15 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారి కృష్ణ కుమార్ విష్ణోయ్ తెలిపారు. రాళ్లదాడికి పాల్పడిన నిందితులను, ఘటనను ప్రేరేపించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల కాల్పుల వల్లే యువకులు మృతి చెందినట్లు వారి కుటుంబీకులు ఆరోపించారు. అయితే ఘర్షణ జరిగినప్పటికీ అధికారులు మాత్రం సర్వేను పూర్తి చేశారు. ఈ ఘటనపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ‘సంభాల్‌లో ఒక తీవ్రమైన ఘటన జరిగింది. ఎన్నికలపై చర్చలకు అంతరాయం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా ఒక సర్వే బృందాన్ని ఉదయం మసీదుకు పంపారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై చర్చించకుండా దృష్టి మరల్చేందుకు మాత్రమే గందరగోళాన్ని సృష్టించారు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.