Mosque Surveys : మసీదుల సర్వేకు దాఖలయ్యే పిటిషన్లపై తొందరొద్దు.. కోర్టులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు
దిశ, నేషనల్ బ్యూరో : హిందూ ఆలయాలపై నిర్మించారనే అభియోగాలతో పలు మసీదులను సర్వే(Mosque Surveys) చేయాలంటూ దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో నిగ్రహం పాటించాలని దేశంలోని కోర్టులకు సుప్రీంకోర్టు నిర్దేశించింది.
దిశ, నేషనల్ బ్యూరో : హిందూ ఆలయాలపై నిర్మించారనే అభియోగాలతో పలు మసీదులను సర్వే(Mosque Surveys) చేయాలంటూ దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో నిగ్రహం పాటించాలని దేశంలోని కోర్టులకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. అలాంటి పాత, కొత్త పిటిషన్ల ఆధారంగా మసీదుల సర్వేలకు కానీ, ఇతరత్రా చర్యలకు కానీ ఆదేశాలు ఇవ్వొద్దని సూచించింది. ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’ను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై గురువారం వాదనలు వింటూ సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తాము ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’లోని లక్ష్యాలు, ఉద్దేశాలపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది.
ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం స్పందనను తెలియజేసిన నాలుగు వారాల్లోగా.. ఈ పిటిషన్లలోని ఇతర పక్షాలు (ముస్లిం సంస్థలు సహా) స్పందన తెలపాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాల ఉనికిని ఎవరూ సవాల్ చేయడానికి వీల్లేదని ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’ చెబుతోంది. అయితే హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు తమతమ ప్రాచీన ప్రార్థనా స్థలాలను తిరిగి సాధించుకునే హక్కును ‘ప్రార్ధనా స్థలాల చట్టం -1991’ హరించిందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.