CE-20: సీఈ-20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష సక్సెస్.. ఇస్రో మరో ఘనత
ఇస్రో మరో కీలక మైలురాయిని సాధించింది. సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్‌కు సంబంధించిన సీ-లెవల్ హాట్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించింది.
దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక మైలురాయిని సాధించింది. సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ (CE20 cryogenic engine)కు సంబంధించిన సీ-లెవల్ హాట్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడు (Tamilnadu)లోని మహేంద్రగిరి(Mahendra giri)లో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లోని వాక్యూమ్ చాంబర్ వెలుపల దీనిని పరీక్షించగా ఇంజిన్ అన్ని సామర్థ్యాలను ప్రదర్శించినట్టు ఇస్రో తెలిపింది. ‘లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ద్వారా స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ 19 టన్నుల థ్రస్ట్ స్థాయిలో పనిచేయడానికి అర్హత పొందింది. ఇప్పటి వరకు ఆరు ఎల్‌వీఎం3 మిషన్‌లను విజయవంతంగా నడిపింది’ అని పేర్కొంది. ఈ ఇంజిన్ రీస్టార్ట్ ఎనేబుల్ సిస్టమ్‌లతో అమర్చబడి ఉండగా.. భవిష్యత్ మిషన్‌లకు చాలా ముఖ్యమైందని ఇస్రో భావిస్తోంది.
ఇంజిన్‌ను విమానం మధ్యలో రీస్టార్ట్ చేయడమే దీని ప్రత్యేకత. పరీక్ష సమయంలో మల్టీ-ఎలిమెంట్ ఇగ్నైటర్ కూడా ప్రదర్శించినట్టు ఇస్రో వెల్లడించింది. సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ భారత్ భవిష్యత్ అంతరిక్ష యాత్రలలో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. కాగా, సీఈ -20 అనేది ఇస్రో అనుబంధ సంస్థ అయిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) చే అభివృద్ధి చేయబడిన క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్. ఇది ఎల్‌వీఎం3 ఎగువ దశకు శక్తినిచ్చేలా అభివృద్ధి చేయబడింది.