JNU: జేఎన్‌యూలో ఘర్షణ.. పలువురు విద్యార్థులకు గాయాలు

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా ప్రదర్శన సందర్భంగా గందరగోళం నెలకొంది.

Update: 2024-12-12 18:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU)లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా ప్రదర్శన సందర్భంగా గందరగోళం నెలకొంది. ఏబీవీవీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఈ సినిమాను ప్రదర్శిస్తుండగా పలువురు గుర్తు తెలియని వ్యక్తులు స్క్రీన్‌పై రాళ్ల దాడి చేశారు. సబర్మతీ హాస్టల్ వైపు నుంచి సినిమా ప్రదర్శన జరుగుతున్న బ్యాడ్మింటన్ కోర్టుపై రాళ్లు రువ్వారు. యూనివర్సిటీలో వేసిన సినిమా పోస్టర్లను సైతం పలువురు చించి వేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు స్టూడెంట్స్‌కు గాయాలైనట్టు ఏబీవీపీ విభాగం అధ్యక్షుడు రాజేశ్వర్ కాంత్ దూబే (Kanth dube) తెలిపారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కాసేపు స్క్రీన్ ఆఫ్ చేసి మళ్లీ సినిమా ప్రదర్శించినట్టు వెల్లడించారు. ఈ ఘటనకు వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలే కారణమని ఆరోపించారు. అయితే జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ధనంజయ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఏబీవీపీ అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తోందని నొక్కి చెప్పారు. క్యాంపస్‌లో ఏబీవీపికి ఆదరణ లేదని, వాళ్లు తెరకెక్కించిన సినిమా ఫ్లాప్ అయిందని తెలిపారు. కాగా, ది సబర్మతీ రిపోర్ట్ సినిమాను 2002 గోద్రా సంఘటన, ఆ తర్వాత జరిగిన గుజరాత్ అల్లర్ల ఆధారంగా రూపొందించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News