Fire accident: తమిళనాడులోని ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు(Tamilnadu)లోని దిండిగల్‌లో ఉన్న ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తిరుచ్చి రోడ్డులోని సిటీ హాస్పిటల్ వద్ద రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్పటల్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆస్పత్రి మొత్తం పొగతో కమ్మేసింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురు బాధితులను లిఫ్టులో గుర్తించారు. వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించారు. ఊపిరాడక వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. మిగిలిన రోగులను, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.