Trump: టైమ్ మ్యాగజీన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్‌’గా ట్రంప్.. రెండో సారి అరుదైన గుర్తింపు

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ టైమ్ మ్యాగజీన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ గా ఎంపికయ్యారు.

Update: 2024-12-12 14:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టైమ్ మ్యాగజీన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ (Person of the Year)గా ఎంపికయ్యారు. ఈ మేరకు మ్యాగజీన్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘చారిత్రాత్మక స్థాయిలో పునరాగమనం చేయడం. ఒక తరంలో ఒకసారి రాజకీయ పునర్వ్యవస్థీకరణకు నాయకత్వం వహించడం. అమెరికా అధ్యక్ష పదవిని పునర్నిర్మించడానికి, ప్రపంచంలో అమెరికా పాత్రను మార్చినందుకు డొనాల్డ్ ట్రంప్ టైమ్ 2024 - పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నికయ్యారు’ అని తెలిపింది.

2016లోనూ యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తొలిసారిగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. దీంతో టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా రెండుసార్లు ఎంపికైన వ్యక్తిగా ఘనత సాధించాడు. అధ్యక్ష పదవిని చేపట్టకముందే ట్రంప్‌కు ఇది పెద్ద విజయంగా అతని సన్నిహితులు పరిగణిస్తున్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారీస్ (Kamala Harries) పై ట్రంప్ విజయం సాధించారు. ఎన్నికలకు ముందు తన ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టి న్యాయపరమైన అడ్డంకులు సృష్టించినా ఎవరూ ఊహించని విధంగా అమెరికా రాజకీయాలను తలకిందులు చేస్తూ వైట్ హౌస్ (White house)కు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రంపును పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా టైమ్ మ్యాగజీన్ ఎంపిక చేయడం గమనార్హం.

Tags:    

Similar News