'రామసేతు'ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని పిటిషన్.. 'నో' చెప్పిన సుప్రీం

‘రామసేతు’ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని, ఆ స్థలంలో గోడ నిర్మించాలని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది.

Update: 2023-10-03 13:44 GMT

న్యూఢిల్లీ: ‘రామసేతు’ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని, ఆ స్థలంలో గోడ నిర్మించాలని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. జస్టిస్‌లు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌ను ‘హిందూ పర్సనల్‌ లా బోర్డు’ ద్వారా అధ్యక్షుడు అశోక్‌ పాండే దాఖలు చేశారు. అంతేకాదు రామసేతు’ని జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంలోనే పెండింగ్‌లో ఉన్నట్లు ధర్మాసనానికి పాండే గుర్తుచేశారు. దానితో తన పిటిషన్‌ను ట్యాగ్ చేయాలని కోరారు.

అయితే, ‘రెండు వైపులా గోడను ఎలా నిర్మించవచ్చు? అని ప్రశ్నంచిన బెంచ్.. ప్రభుత్వ పరిపాలనాపరమైన విషయాల్లోకి మేము ఎందుకు రావాలి?’ అని పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌తో తన అభ్యర్థనను ట్యాగ్ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను నిరాకరించింది. ‘పిటిషనర్ కోరినట్లుగా ఏదైనా దిశానిర్దేశం చేయడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం అధికార పరిధిని వినియోగించుకోవడానికి మేము మొగ్గు చూపడం లేదు’ అని పేర్కొంటూ పిటిషన్‌ను స్వీకరించడానికి ధర్మాసనం నిరాకరించింది.


Similar News