Supreme Court : మెడికల్ ప్రొఫెషనల్స్ భద్రతకు కేంద్ర చట్టం అక్కర్లేదు : నేషనల్ టాస్క్ ఫోర్స్

దిశ, నేషనల్ బ్యూరో : వైద్యరంగంలోని సిబ్బందికి భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ చట్టమేదీ(central law) అక్కర్లేదని సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టీఎఫ్) సిఫారసు చేసింది.

Update: 2024-11-17 12:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వైద్యరంగంలోని సిబ్బందికి భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ చట్టమేదీ(central law) అక్కర్లేదని సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టీఎఫ్) సిఫారసు చేసింది. ప్రస్తుతం రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాలు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)-2023లోని నిబంధనల ద్వారా వైద్యరంగ సిబ్బందికి తగినంత భద్రత లభిస్తుందని స్పష్టంచేసింది. ఆగస్టు 9న జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఉదంతం నేపథ్యంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టీఎఫ్)ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దేశంలోని వైద్యరంగ సిబ్బందికి భద్రతను కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రతిపాదించాలని ఎన్‌టీఎఫ్‌కు నిర్దేశించింది. ఈ అంశంపై అధ్యయనం పూర్తిచేసిన ఎన్‌టీఎఫ్‌ నిపుణుల బృందం.. 37 పేజీల సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

24 రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టాలు

మెడికల్ ప్రొఫెషనల్స్‌‌(medical professionals)తో పాటు వైద్య సంస్థలపై దాడులు జరిగితే రక్షణ కల్పించేందుకు 24 రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలు చేశాయని ఎన్‌టీఎఫ్ గుర్తుచేసింది. మరో రెండు రాష్ట్రాలు కూడా అదేవిధమైన చట్టాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నాయని తెలిపింది. వైద్య సంస్థలు, వైద్య సిబ్బందిపై జరిగే దాడులకు సంబంధించిన మైనర్, మేజర్ కేసుల్లో శిక్షలు విధించేందుకు రాష్ట్రాల చట్టాలు, భారతీయ న్యాయ సంహిత సరిపోతాయని ఎన్‌టీఎఫ్ తెలిపింది. 500కుపైగా బెడ్స్ కలిగిన ఆస్పత్రులు రోజులో 24 గంటల పాటు పనిచేస్తుండే సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సిఫారసు చేసింది. నిఘా టెక్నాలజీ, శిక్షణ పొందిన ఆస్పత్రి భద్రతా సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను ఈ తరహా పెద్ద ఆస్పత్రులు అందుబాటులో ఉంచుకోవాలని ఎన్‌టీఎఫ్ పేర్కొంది.

మహిళా సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఐసీసీలు

‘‘ఆస్పత్రుల్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ)లు ఉండాలని ‘పీఓఎస్‌హెచ్ యాక్ట్ - 2013’లో ప్రస్తావన ఉంది. దాన్ని అనుసరించాలి. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో మహిళా సిబ్బంది ఎదుర్కొనే సమస్యలను ఈ కమిటీలు పర్యవేక్షించాలి’’ అని ఎన్‌టీఎఫ్ తెలిపింది. ‘‘పనిచేసే చోట వేధింపులు ఎదురైతే మహిళలు ఫిర్యాదు చేసేందుకు షీబాక్స్ (SHe-Box) పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిపై వైద్యరంగంలోని మహిళా సిబ్బందికి అవగాహన కల్పించాలి’’ అని సూచించింది. భద్రమైన డ్యూటీ రూమ్స్, రవాణా వసతులు వంటివి వైద్యరంగంలోని మహిళా సిబ్బందికి ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు కల్పించాలని కోరింది.

Tags:    

Similar News