మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్బంగా దీనిపై స్పందన తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది. అంతకుముందు బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో దాన్ని సవాలు చేస్తూ సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విచారణ నుంచి జులై 11న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కేసును వాయిదా వేసింది . తాజాగా మంగళవారం న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సంజయ్ కరోల్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను జులై 29కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగించారు. ఇటీవల జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరుచగా, కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.