రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే.. ఎస్‌బీఐకి సుప్రీం ఆర్డర్

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడికి మరో మూడు నెలలు (జూన్ 30 వరకు) గడువు ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Update: 2024-03-11 14:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడికి మరో మూడు నెలలు (జూన్ 30 వరకు) గడువు ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా సమయం ఇచ్చేది లేదని.. మంగళవారం(మార్చి 12న) సాయంత్రం పనిగంటలు ముగిసేలోగా విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందే అని ఎస్‌బీఐను దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఈమేరకు వ్యాఖ్యలు చేస్తూ ఎస్‌బీఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎస్‌బీఐ అందించే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 15న సాయంత్రం 5 గంటల్లోగా బహిర్గతపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్‌బీఐని ధర్మాసనం ఆదేశించింది.అయితే మరింత గడువు కావాలని సుప్రీంను ఎస్‌బీఐ ఆశ్రయించింది. దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపర్చామని.. వాటిని మ్యాచ్‌ చేసి వివరాలను ఇచ్చేందుకు మరింత సమయం కావాలని ఎస్‌బీఐ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ పై తీర్పును వినిపించింది.

Tags:    

Similar News