Supreme court: ఖైదీల్లో కుల వివక్ష సరికాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జైళ్లలో ఖైదీలకు కుల ప్రాతిపదకన పనిని కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Update: 2024-10-03 07:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జైళ్లలో ఖైదీలకు కుల ప్రాతిపదకన పనిని కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని కులాల‌కు చెందిన వారిని స‌మానంగా చూడాల‌ని పేర్కొంది. జైలు మాన్యువల్స్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. కుల వివక్షను పెంచే ఈ తరహా రూల్స్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని పలు జైళ్లలో ఉన్న ఖైదీలపై కుల ఆధారిత వివక్ష జరుగుతోందని జర్నలిస్టు సుకన్య శాంత గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించింది. ‘కులం ఆధారంగా ఖైదీలను వేరు చేయడం కుల వివక్షను మరింత బలపరుస్తుంది. ఖైదీలకు గౌరవం ఇవ్వకపోవడం వలసరాజ్యాలకు చెందిన విధానం. ఖైదీలు కూడా హక్కులు పొందడానికి అర్హులు. వారిని మానవత్వంతో చూడాలి. వారికి మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో అవసరం’ అని వ్యాఖ్యానించింది.

ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమే..

ఖైదీలెవరూ కులం ఆధారంగా వివక్షకు గురికాకుండా చూసుకోవాలని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ జైలు మాన్యువల్‌లను సవరించి కుల ఆధారిత పని విభజనను ముగించాలని ధర్మాసనం ఆర్డర్స్ జారీ చేసింది. ఈ తరహా వివక్ష రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తాయని అభిప్రాయపడింది. ఉన్నత కులాలకు చెందిన వారితో వంటలు వండటం వంటి పనులు చేయిస్తూ.. అట్టడుగు వర్గాల వారికి క్లీనింగ్, స్వీపింగ్ వంటి నీచమైన పనులను అప్పగించడం సరికాదని, ఈ విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని వెల్లడించింది. జైలు మాన్యువల్‌లు నిర్దిష్ట సమూహాలకు కించపరిచే పనులను అప్పగించడం ద్వారా కుల ఆధారిత పక్షపాతాన్ని శాశ్వతం చేయకూడదని తెలిపింది.

జైలు మాన్యువల్‌ను సవరించాలి

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా తమ జైలు మాన్యువల్‌లను సవరించాలని అన్ని రాష్ట్రాలను బెంచ్ ఆదేశించింది. అండర్ ట్రయల్ రిజిస్టర్ల నుంచి కులానికి సంబంధించిన ప్రస్తావనలను తొలగించాలని సూచించింది. దేశవ్యాప్తంగా జైళ్లలో కుల ఆధారిత వివక్షను సహించబోమని వెల్లడించింది. ప్రమాదకర పరిస్థితుల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయడం వంటి పనులను ఖైదీలకు అప్పగించొద్దని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై మూడు నెలల్లోగా రాష్ట్రాలు తమ నివేదికలను కోర్టుకు అందజేయాలని తెలిపింది. 


Similar News