నూతన ఈసీలు ఇద్దరూ ఒకటే బ్యాచ్.. కెరీర్ విశేషాలివీ

దిశ, నేషనల్ బ్యూరో : నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా మాజీ బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్‌ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ ఎంపికయ్యారు.

Update: 2024-03-14 13:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా మాజీ బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్‌ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ ఎంపికయ్యారు. ఇద్దరూ 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారే కావడం విశేషం. కేరళ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ జ్ఞానేశ్ కుమార్‌, ఉత్తరాఖండ్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుఖ్‌భీర్‌ సింగ్‌ సంధు పేర్లను కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం మధ్యాహ్నం ఖరారు చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో కేంద్ర హోం వ్యవహరాల శాఖ తరఫున కశ్మీర్‌ డివిజన్‌ను జ్ఞానేష్‌కుమార్‌ పర్యవేక్షించారు. గతంలో పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు కార్యదర్శిగానూ పనిచేశారు. సుఖ్‌భీర్‌ సింగ్‌ సంధు పంజాబ్‌ వాస్తవ్యులు. బీజేపీ సీనియర్ నేత పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021లో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సంధు గతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గానూ పనిచేశారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖలో అదనపు కార్యదర్శిగా సైతం పనిచేశారు.ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల మరో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఈవిధంగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన రెండు స్థానాలలో సుఖ్‌బీర్‌ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే.. ఎంపిక కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్‌ చౌదరి పేర్లను మీడియాకు వెల్లడించారు.

సెర్చ్‌ కమిటీ ప్రతిపాదిత జాబితాపై..

అంతకుముందు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను తయారు చేసింది. గురువారం మధ్యాహ్నం ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై ఈ జాబితాపై చర్చించింది. ఈ కమిటీలో కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధిర్‌ రంజన్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఇక ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. కాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం (మార్చి 15న) విచారణ జరపనుంది.

Tags:    

Similar News