Suicide: కాళీ దేవి కోసం ప్రార్థన.. దర్శనమివ్వడం లేదని పూజారి సూసైడ్
వారణాసిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాళీ దేవి కోసం ప్రార్థన చేయగా మాత దర్శనమివ్వడం లేదని మనస్తాపం చెంది ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ (Uthara Pradesh)లోని వారణాసి (Varanasi)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాళీ దేవి కోసం ప్రార్థన చేయగా మాత దర్శనమివ్వడం లేదని మనస్తాపం చెంది ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయ్ ఘాట్ ప్రాంతంలో నివసిస్తున్న అమిత్ శర్మ (Amith sharma) (40) అనే పూజారి కాళీ దేవికి అపారమైన భక్తుడు. శనివారం నుంచి ఓ గదిలో కాళీ మాత దర్శనం కోసం ప్రార్థనలు చేశారు. గదిని మూసి వేసి ఎవరూ వెళ్లకుండా ప్రార్థనలో మునిగిపోయాడు. ఈ క్రమంలో 24 గంటల పాటు పూజలు చేశాక కాళీ మాత తన ఎదుట కనిపించకపోవడంతో నిరాశ చెంది కత్తితో తన గొంతు కోసుకున్నారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అమిత్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఇషాన్ సోనీ (Ishan sony) తెలిపారు. ప్రార్థన సమయంలో ‘అమ్మా కాళీ దర్శనమివ్వు’ అని పూజారి నిరంతరం జపించినట్టు స్థానికులు తెలిపారు. కాశీ విశ్వనాథ ఆలయంలో ఆయన పూజలు చేసేవారని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.