'చేతనైతే అడ్డుకోండి'.. ఈడీ జారీ చేసిన సమన్లపై అభిషేక్‌ బెనర్జీ కీలక వ్యాఖ్యలు

ఈడీ సమన్లపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-29 11:59 GMT

కోల్‌కతా: ఈడీ సమన్లపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు2, 3 తేదీల్లో ఢిల్లీలో టీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా తనను ఏ శక్తీ అడ్డుకోలేదంటూ ఆయన ట్వీట్ చేశారు. చేతనైతే తనను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. గతంలోనూ ‘ఇండియా’ కూటమి సమావేశానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈడీ తనకు సమన్లు జారీ చేసిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో సరిగ్గా వచ్చే నెల 2, 3 తేదీల్లోనే విచారణకు రావాలంటూ అభిషేక్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే బెంగాల్‌కు ఉపాధి హామీ నిధుల విడుదలలో కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా అవే తేదీల్లో దేశ రాజధానిలో జరగబోయే కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొంటాననే సంకేతాలిచ్చేలా అభిషేక్‌ కామెంట్స్ చేశారు. ఇక బెంగాల్‌ బొగ్గు కుంభకోణం కేసులోనూ అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య రుజిరాపై అభియోగాలు ఉన్నాయి.

Similar News