'కర్ర ప్రాణాంతక ఆయుధం కాదు'.. జైలు శిక్షను తగ్గించిన సుప్రీం కోర్టు

కర్ర ప్రాణాంతకమైన ఆయుధం కాదని, కర్రతో కొట్టడం వల్లే చనిపోయారని చెప్పడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-08-01 12:49 GMT

న్యూఢిల్లీ: కర్ర ప్రాణాంతకమైన ఆయుధం కాదని, కర్రతో కొట్టడం వల్లే చనిపోయారని చెప్పడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భర్తను కర్రతో భార్య కొట్టి చంపిందన్న ఆరోపణలపై ఓ మహిళ కేసును జస్టిస్ బి.ఆర్. గవాయ్, జె.బి. పార్ధివాలాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ కేసులో నిందితురాలిపై నమోదైన హత్యానేరాన్ని నేరపూరిత నరహత్యగా మార్చింది. ఆమెకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను తొమ్మిదేళ్లకు తగ్గించింది. తొమ్మిదేళ్ల శిక్షను నిందితురాలు ఇప్పటికే అనుభవించింది. నేరంలో ఉపయోగించిన ఆయుధం ఇంట్లో పడి ఉన్న కర్ర అని గుర్తించిన కోర్టు దాన్ని ఏ విధంగానూ ప్రాణాంతకమైన ఆయుధంగా భావించలేమని స్పష్టం చేసింది.

నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి.) క్యాంపులో చేరేందుకు తనకు రూ.500 ఇవ్వలేదని తన కుమార్తె ఫిర్యాదు చేయడంతో నిందితురాలు తన భర్తను కర్రతో కొట్టడంతో అతడు చనిపోయాడు. ఆ కుటుంబంలో సంబంధాలు స్నేహపూర్వకంగా లేవని, దంపతులు తరచూ గొడవ పడుతున్నారని, ఆ గొడవలు కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతున్నాయని కోర్టు గుర్తించింది. మృతుడు తన భార్య కాలు విరగ్గొట్టడంతో ఆమె రక్షణ కోసం తన భర్తపై కర్రతో దాడి చేసిందని, అది అతడి మృతికి దారి తీసిందని పేర్కొన్నది.


Similar News