Sandeep Singh Sidhu : కెనడాకు భారత్ షాక్.. ‘పరారీలో ఉన్న ఉగ్రవాది’గా సందీప్ సింగ్ సిద్ధూ గుర్తింపు

దిశ, నేషనల్ బ్యూరో : భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది.

Update: 2024-10-19 19:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది. గతేడాది కెనడాలో జరిగిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ హత్య కేసును భారత్‌కు అంటగట్టే దుష్ట ప్రయత్నాల్లో కెనడా నిమగ్నమై ఉంది. ఈ తరుణంలో భారత్‌ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) సభ్యుడు సందీప్ సింగ్ సిద్ధూను పరారీలో ఉన్న ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. ఐఎస్‌వైఎఫ్‌పై భారత్‌లో చాలా ఏళ్లుగా నిషేధం అమల్లో ఉంది. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడానికి సందీప్ సింగ్ సిద్ధూ సహాయ సహకారాలు అందిస్తున్నాడని భారత్ ఆరోపించింది.

2020 అక్టోబరులో పంజాబ్‌లోని తరణ్ తరణ్‌లో బల్వీందర్ సింగ్ సంధూ హత్యకు కుట్రను అమలు చేయడానికి పాకిస్తాన్‌కు చెంది ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్, పాక్ ఐఎస్ఐతో అతడు టచ్‌లో ఉన్నాడని భారత్ పేర్కొంది. నేర చరిత్ర ఉన్నప్పటికీ కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీలో సూపరింటెండెంట్‌గా సందీప్ సింగ్ సిద్ధూకు ప్రమోషన్ వచ్చిందని గుర్తుచేసింది. బల్వీందర్ సింగ్ హత్యలో అమెరికా, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్) కార్యకర్తలు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించారని కొన్ని రోజుల క్రితం భారత సుప్రీంకోర్టుకు ఎన్ఐఏ తెలిపింది.


Similar News