కశ్మీర్‌‌కు త్వరలోనే రాష్ట్ర హోదా : ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

Update: 2024-06-20 18:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం త్వరలోనే రాష్ట్ర హోదాను కూడా పొందుతుందని ఆయన వెల్లడించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్‌లో దాదాపు రూ.1500 కోట్లు విలువైన పలు అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించారు. నగరంలోని షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌ (ఎస్‌కేఐసీసీ) లో నిర్వహించిన ‘ఎంపవరింగ్ యూత్ ట్రాన్స్‌ఫార్మింగ్’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. శత్రువులకు తగిన సమయంలో దీటైన సమాధానం ఉంటుందని మోడీ చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అడ్డుగోడ తొలగిపోయిందని.. ఇప్పుడు అందరికీ రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.

భారత రాజ్యాంగం కశ్మీర్‌లో పూర్తిస్థాయిలో అమలవుతోందన్నారు. వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రపంచానికి భారత్‌ బలమైన సందేశం ఇచ్చిందని మోడీ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని యువత పెద్ద సంఖ్యలో పాల్గొందని.. తద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన దాదాపు 2000 మంది స్థానిక యువతకు ప్రధాని మోడీ నియామక పత్రాలను అందజేశారు. కశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు యత్నించే సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనివ్వమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కాాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం (జూన్‌ 21న) ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని ఎస్‌కేఐసీసీలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో మోడీ పాల్గొననున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో శ్రీనగర్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం శ్రీనగర్‌ను రెడ్ జోన్‌గా మార్చారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్, దాల్ సరస్సు చుట్టూ వేల సంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలు మోహరించారు.


Similar News