South Korea: సౌత్ కొరియా అధ్యక్షుడికి అరెస్టు ముప్పు

దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk Yeol)కు మరో షాక్ తగిలింది. ఎమర్జెన్సీ వివాదంలో అభిశంసనను ఎదుర్కొంటున్న యూన్.. అరెస్టుకు కోర్టు అంగీకరించింది.

Update: 2024-12-31 04:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk Yeol)కు మరో షాక్ తగిలింది. ఎమర్జెన్సీ వివాదంలో అభిశంసనను ఎదుర్కొంటున్న యూన్.. అరెస్టుకు కోర్టు అంగీకరించింది. యూన్‌ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో, సియోల్‌ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్‌ కోర్టు ఈ అరెస్టు వారెంట్‌ను జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థలోని ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు. కాగా.. ఈ అంశంపై స్పందించేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు, యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడం పైనా దర్యాప్తు కొనసాగుతోంది. న్యాయవాదులతో పాటు పోలీసు, రక్షణ మంత్రిత్వశాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన జాయింట్ టీమ్ అధ్యక్షుడిని విచారిస్తోంది. కాగా మూడుసార్లు ఆయన్ని విచారణకు పిలిచినా హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్‌ వారెంట్‌ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

ఎమర్జెన్సీ కలకలం

ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ (Emergency Martial Law) విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 24 గంటల్లోనే ఆ ప్రకటనను విరమించుకున్నారు. అయితే, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే, యూన్‌ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. అంతేకాకుండా, యూన్‌ సైతం దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు, సీనియర్ సలహాదారులు చెబుతున్నారు.


Similar News