Kerala : ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ వ్యాఖ్యల పర్యవసానం.. సిమీ రోజ్‌బెల్‌‌పై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు

దిశ, నేషనల్ బ్యూరో : జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది.

Update: 2024-09-01 18:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎంతోమంది నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపుల వివరాలను ధైర్యంగా బయటపెడుతున్నారు. ఈతరుణంలో కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సిమీ రోజ్‌బెల్‌ జాన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అనేది సినీరంగానికే పరిమితం కాలేదని, రాజకీయాల్లోనూ ఈ విపరీత పోకడ ఉందని ఆమె ఆరోపించారు. తమ పార్టీలో చాలా మంది మహిళలు.. పురుష నేతల నుంచి అభ్యంతరకర ప్రవర్తనను ఎదుర్కొంటున్నారని సిమీ రోజ్‌బెల్‌ జాన్‌ తెలిపారు. ఆ చేదు అనుభవాల గురించి కొంతమంది బాధితులు తనకు చెప్పుకొని బాధపడ్డారన్నారు.

సమయం చూసుకుని వాటన్నింటినీ బయటపెడతానని ఆమె వెల్లడించారు. దీంతో సిమీ రోజ్‌బెల్‌‌పై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ హైకమాండ్‌కు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ విభాగం ఫిర్యాదు చేసింది. సిమీ రోజ్‌బెల్‌ జాన్‌‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేరళ కాంగ్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సిమీ రోజ్‌బెల్‌‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్ ఖండించారు. ఆమె ఆరోపణలు ఆధారరహితమైనవన్నారు. అయినా వాటిపై పార్టీపరమైన దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.


Similar News